Saturday, September 20, 2008

తన కోపమే….

ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాడు. అతనికి కోపం చాలా ఎక్కువ. అతడు ఉన్నదానికీ లేని దానికీ కోపం తెచ్చుకుని అందరినీ కోప్పడుతూ ఉండేవాడు.అతని తండ్రి కోపం తగ్గించుకోవడానికి ఒక సలహా ఇస్తాడు. అతనికి ఒక సంచి నిండా పొడుగాటి సీలలు(nails) ఇచ్చి ఇకనుంచీ నువ్వు ఎవరిపైనైనా కోప్పడినప్పుడల్లా ఒక సీలని ఈ గోడ లోకి కొట్టమని చెప్తాడు. మొదటిరోజు ఆ అబ్బాయి పదిహేను సీలలు గోడలోకి కొడతాడు. రోజులు గడిచే కొద్దీ అతను కొట్టే సీలలు తగ్గుతూ వస్తాయి. అతను ఈ సీలలు గోడలోకి కొట్టడం కన్నా తన కోపాన్ని అదుపులో ఉంచడమే సులభంగా ఉందని అనుకుంటూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత అతను ఒక రోజు అసలు ఎవ్వరి మీద కోప్పడడు. అతను ఎంతో ఆనందం తో తన తండ్రి దగ్గరకి వెళ్లి నాన్నా ఈ రోజు నేను ఎవ్వరి మీద కొప్పడలేదు అని చెప్తాడు. అప్పుడు తండ్రి చాలా మంచిది నాయనా, ఇక నుండీ నువ్వు ఎవ్వరి మీద కోప్పడని రోజున రోజుకొక్కటి చొప్పున ఆ గోడలో కొట్టిన సీలలు తీసివెయ్యమని చెప్తాడు.

కొన్ని రోజుల తర్వాత అతను అన్ని సీలల్నీ తీసివేయగలుగుతాడు. అప్పుడు అతను తన తండ్రితో తను అన్ని సీలలనీ తీసివేయగలిగానని చెప్తాడు. అప్పుడు ఆ తండ్రి, నువ్వు చాలా మంచి పని చేసావు నాయనా..కానీ నువ్వు గోడకి కొట్టిన సీలల్నైతే తీసి వేయగాలిగావు కానీ ఆ సీలలు గోడకు చేసిన గాయాన్ని మాన్చలేవు. ఆ గోడకున్న రంధ్రాలను చూసావా, ఆ గోడ తిరిగి మామూలుగా ఎప్పటికీ అవదు. అలాగే నువ్వు ఎవరినైనా కోపంలో ఎన్నో మాటలని అని వారి మనసును గాయపరిచిన తర్వాత నువ్వు వాళ్ళకి ఎన్ని క్షమాపణలు చెప్పినా సరే నువ్వు చేసిన ఆ గాయమనేది మానదు అని చెప్తాడు. ఆ తరువాత ఆ అబ్బాయి తన తండ్రి నేర్పిన ఈ పాఠాన్ని ఎప్పుడూ మరిచిపోలేదు.

Thursday, September 18, 2008

మార్చగలిగేవీ మార్చలేనివీ

నేను ఈమధ్యనే ఒక వాక్యం చదివాను. దాని ప్రకారం మన మన జీవితాల్లో మార్చగలిగే పరిణామాలూ ఇంకా మార్చలేని పరిణామాలూ అని రెండు రకాలు ఉంటాయట. అంటే ప్రతి సందర్భం లో, ప్రతి పరిస్థితిలోనూ మనం మార్చగలిగేవీ మార్చలేనివీ ఉంటాయన్నమాట. మనం మార్చలేని పరిణామాలని పట్టుకుని బాధపడుతూ మార్చగలిగే వాటిని గురించి పట్టించుకోకుండా గడిపేస్తాం. ఇలా కాకుండా మనం మార్చగలిగే వాటిని మార్చి, మార్చలేనటువంటి వాటిని మార్చలేమని ఒప్పుకుంటూ వాటిని గురించి ఆందోళన పడకుండా, గడిపితే ఆనందం దానంతట అదే మన దగ్గరకి వస్తుందని అర్ధం.
చివరగా
మనం మార్చగలిగేవి మార్చాలంటే ధైర్యం కావాలి. మార్చలేనివి ఒప్పుకోవాలంటే ప్రశాంతమైన మనస్సు కావాలి. ఏవి మార్చగలమో ఏవి తెలియాలంటే తెలివి కావాలి. చక్కగా చెప్పారు కదా.

Monday, September 15, 2008

నమస్తే

అందరికీ నమస్కారం.
నేను రెండు నెలలుగా తెలుగు బ్లాగులను చదువుతున్నాను. నేను ఈ బ్లాగుల ద్వారా కొన్ని మంచి విషయాలను నేర్చుకున్నాను. కొన్ని అభిప్రాయాలు ఏర్పరుచుకోగాలిగాను. అందుకు తెలుగు బ్లాగర్లందరికీ నా కృతజ్ఞతలు. నేను కూడా ఒక మంచి బ్లాగుని ఎందుకు ప్రారంభించకూడదని అనుకున్నాను. ఇదిగో ఇప్పుడే నా బ్లాగుని ప్రారంభిస్తున్నాను. ఇందులో నా అభిప్రాయాలూ, నా అనుభవాలూ, ఇంకా నాకు మంచివి అనిపించిన విషయాలూ రాద్దామని అనుకుంటున్నా. సీనియర్ బ్లాగర్లు నా ఈ ప్రయత్నాన్ని మన్నించి, ప్రోత్సహిస్తారని భావిస్తూ.

శరత్ సోలా.